జనసేన నేతల పేరుతో 7కోట్ల మోసం – మహిళ అరెస్ట్

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్

 

జనసేన పార్టీ నేతల పేర్లు చెప్పి దేవాదాయ,పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసిన ధరణి కృష్ణ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

విజయవాడకు చెందిన ధరణి కృష్ణ మంగళగిరిలోని కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగినిగా పనిచేశారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్,జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు తనకు బాబాయ్ అవుతారని,ఆయన పలుకుబడితో దేవాదాయ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ధరణి కృష్ణ పలువురిని నమ్మించారు. ఇలా ఏలూరు జిల్లాలో 16 మంది,తణుకులో 20 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారు.మీరిచ్చే డబ్బుకు మా బాబాయే గ్యారెంటీ అని నమ్మబలికారు.అందుకోసం శివశ్రీనివాసరావు ఫొటోతో కూడిన నకిలీ వాట్సప్ ఖాతా,ఆడియో కాల్స్ను సృష్టించారు.

ప్రభుత్వ ముద్రలు, అధికారుల సీళ్లతో కూడిన నకిలీ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందజేశారు.మరోవైపు తాను పనిచేస్తున్న కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరును, ఆ సంస్థ సీఈవో కోట రుక్మిణి పేరును కూడా ధరణి కృష్ణ దుర్వినియోగం చేశారు.ఆ కంపెనీ పేరిట నలుగురు బాధితులకు రూ.10 లక్షలు చొప్పున తిరిగి చెల్లిస్తున్నట్లు నకిలీ బిల్లులు,రసీదులు సృష్టించారు.ఈ నెల 5న *ఏలూరుకు చెందిన* తరుణ్ ఈ మోసం గురించి శివశ్రీనివాసరావుకు తెలిపారు.బాధితుల వద్ద ఉన్న నకిలీ పత్రాలు, స్క్రీన్షాట్లను పరిశీలించిన ఆయన కైరెన్ కన్సల్టెన్సీ సీఈవో కోట రుక్మిణిని అప్రమత్తం చేశారు.దీంతో ఆ సంస్థ ఈ నెల 9న ధరణి కృష్ణకు షోకాజ్ నోటీసు జారీ చేయగా,ఆమె తన నేరాన్ని అంగీకరిస్తూ రాతపూర్వక వివరణ సమర్పించారు. నిమ్మకాయల పెద్దిరాజు ప్రోద్బలంతో తాను ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్నానని అంగీకరించారు. తరువాత ఆమెను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.ఈ వ్యవహారంపై శివశ్రీనివాసరావు,కోట రుక్మిణిలు మంగళగిరి గ్రామీణ పోలీసులకు బుధవారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *